Tuesday, 10 September 2013

గు(చి)రు అభిమానం


గు(చి)రు అభిమానం



రాధా మనోహరి టీచర్ గారికి!!
ఉభయకుశలోపరి!!
గురుపూజోత్సవ శుభాకాంక్షలు. మీ శిష్యురాలిగా మీ దగ్గర విద్య నేర్చుకున్నందుకు , నన్నొక మంచి పౌరురాలిగా తీర్చి దిద్దిన మీ దంపతులిద్దరికీ నా మనః పూర్వక కృతఙ్ఞతలు.

 టీచర్ గారూ,  ఏదో  ఒక రకం గా మిమ్మలిని తలచుకోలేని రోజు లేదు అంటే నమ్మండి. చివరకు
ఇటీవలే  వచ్చిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే సినిమా చూస్తున్న మిమ్మలినే తలచుకున్నాను. మీరు చిన్నప్పుడు మాకు చెప్పిన ఓ చిరు పాట సినిమా రూపం లో దర్శనం కాగానే, ఎంత ఆనంద పడ్డానో అంతే మీరు దగ్గర లేరు అని బాధపడ్డాను.  ఆ పాట ఎప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది
కొమ్మ విరగాకుండా పూలు కోయండి
అందులోపెద  పూలు  దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకివ్వండి

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దాచుకోకుంటేను దోచుకుంటారు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు

అంటూ సరదాగా మీరు చెప్పిన  అనేక పాటలు, భాగవత పద్యాలు, బీర్బల్ కథలు  ఇలా ఒకటేమిటి అన్ని నెమరువేసుకుంటూ ఉంటాను .

ఇంతేకాదు టీచర్ గారూ! మీరు మాకు పరిచయం చేసిన భువన విజయం , అల్లసాని పెద్దన, నది తిమ్మన అంటూ వారి పరిచయాలు , వికటకవి గురించి చెప్పిన కథలు , వారి కళాపోషణ , రత్నాలు రాశులుగా అమ్మటం ఇవన్ని కేవలం ఎలిమెంటరీ లోనే మాకు పరిచయం, వాటిమీద ఆసక్తి కలుగచేసారు . నా ఉన్నత విద్య రీత్యా రాయల సీమ లో చదువుకున్నప్పుడు నేను ఎంత అలౌకిక ఆనందానికి గురి అయ్యానో, ఆ ఆనందం వెనుక కారణం ఏమిటో ఇక నేను మీకు చెప్పనక్కర్లెదు.

అంతేకాదు టీచర్ గారూ,\!! ఈ మధ్య ఎక్కడ చూసినా విభజన గొడవలే కదా!!! ఈ మధ్య ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లాల పేర్లు వరుసగా చెప్పటం మీద చర్చ చేస్తున్నారు !! వెంటనే నాకు అలవోకగా "శ్రీకాకుళం, విజయనగరం ..... హైదరాబాద్ " దగ్గర fullstop పెట్టేటప్పటికి అవాక్కవటం వారి వంతయింది. అప్పుడు నేను మా టీచర్ గారు ప్రతిరోజు మా చేతచెప్పించేవారు అని చెప్పాను. అప్పుడు కూడా నేను మీ శిష్యురానిని అయినందుకు నేను చాల గర్వపడ్డాను. ఇలా ఒకటేమిటి రోజూ ఏదో ఒక రకం గా మిమ్మలిని తలుస్తూనే ఉంటాను .

ఇంకా ఇప్పటి చిన్న పిల్లలు అయితే, మాధ్యమాల ప్రభావం కావచ్చు  టీచర్ గారు!!! పిల్లల పాటలు తెలిసిన పిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు, తపు తప్పు, అసలు అవి తెలుగులో బోధించే టీచర్లు లేరు!! మీరు మాకు సాయంత్రం కాగానే ఎన్ని పాటలు పాడించే వాళ్ళు !!అంతెందుకు , పోతన భాగవతంలోని పద్యాలు మీ దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్ధికి వచ్చు  తెలుగులోని మాధుర్యం మేము మీ దగ్గర అనుభవించిన వాళ్ళమే!!! మీరు కమ్మగా పాడుతుంటే ఎంత మధురంగా ఉండేది??? అందరం నిశ్సబ్దంగా ఉండేవాళ్ళము అంటే  మీ పాటకు మేము బానిసలము !!

మీరు బడికి రాని  రోజు  ఎంతో నిస్సత్తువగా ఉండేది . ఇప్పటికీ ఊరు వెళ్తే మన సత్రం బడి కనపడుతుంది (మా బడి కి ఉన్న పేరు అది. మాకు బడి ఉంది కాని బడికి భవనం లేక, ఎటువంటి సదుపాయాలూ లేని, కనీసం ఒక గేటు కూడా లేని   ఒక విశ్రాంతి భవనం లో మా బడి నడిచేది, అందుకే దానికి సత్రం బడి అని పేరు ) చాల శిధిలావస్థలో ఉంది!!! కాని ఆ జ్ఞాపకాలు మాత్రం  పదిలంగా మదిలో భద్రం గా ఉన్నాయి.

ఇక మీకు ఎప్పుడన్నా పొలమారినా , నేనో లేక నా లాంటి మీ శిష్యులు మిమ్మలిని తలుస్తున్నారు అని మీకు తెలియాలని మీ కోసం  మొన్నీమధ్య వాకబు చేశాను .!! మీరిక్కడ లేరని, చల్లపల్లిలో  ఉన్నారని సమాచారం అందింది ఎక్కడున్నా మీరు క్షేమం గాఉండాలని , మరింతమంది భావి భారత పౌరుల్ని తయారు చేయాలని ఆశిస్తూ ...
                                                                                                                మీ చిన్నారి
                                                                                                                    సుభాషిణి




No comments:

Post a Comment